/
0 Comments
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా నిర్మించబడింది. చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీ చూసే వరకు గొప్ప లీడర్ ఉన్నట్టు  తెలియదు అతనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. 




1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ళముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటుజెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినారు. ఈయన పాలెగార్ మనవడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1805 రూపనగుడి గ్రామం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ వద్ద జన్మించారు.ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.


1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పుడు రాయలసీమ నైజాం వశంలో ఉండేది. నైజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చారు. కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్ళుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు.


ఈనాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాళెగాడు పెద్దమల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. కోయిలకుంట్ల తాలూకా లోని ఉయ్యాలవాడ జాగీర్‌ను ఆంగ్లేయులు వశం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుండి 30 వేల రూపాయలకు పైగా రెవిన్యూ రాబడి వుండేది. జాగీర్‌ను వశం చేసుకున్న తెల్లదొరలు పెద్దమల్లారెడ్డి కుటుంబానికి రు. 70 ఫించన్ ఏర్పాటు చేశారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుదా 11 రూపాయలు 10 అణాలు 8 పైసలు ఫించన్ వచ్చేది.

నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు.


1846 జూన్ నెలలో తనకు రావలసిన మేనెల ఫించన్ పైకం కోసం, చీటి వ్రాసి కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపాడు నరసింహారెడ్డి. అదివరకు, పైకం పంపుతున్న తాసిల్దార్ ఈసారి వచ్చిన మనిషిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేకాని ఫించన్ పైకం యివ్వనన్నాడు. రెడ్డి ఉదాసీనంగా వుండటం గమనించిన తహసీల్దారు వారంట్ యిచ్చి బంట్రోతులను పంపాడు. వచ్చిన వాళ్ళను తన్ని తరిమేశాడు నరసింహారెడ్డి. ఈ విధంగా పోరాటం ఆరంభమైందంటారు.


మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు కొండజాతుల వాళ్ళు నరసింహారెడ్డిని ఆశ్రయించారు. నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 9 వేల మంది చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరారు. కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెట్టింది.

నరసింహారెడ్డి 5 వేల బలగంతో పాట్సన్‌ను గిద్దలూరు వద్ద అడ్డుకున్నాడు. పాట్సన్ వద్ద సైనికులు వందమందే. ఆరు గంటలసేపు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరిగింది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణించారు.బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. నరసింహారెడ్డి పాలెగాణ్ణి పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వ ప్రకటించింది


1846 అక్టోబర్ 6వ తేదీన ఎర్రమల నలమల కొండల మధ్యనున్న పేరసామల లోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపారు. వందమంది దాకా గాయపడ్డారు. కాలికి గుండు దెబ్బ తగలడంతో రెడ్డి ఫిరంగి దళాలకు పట్టుబడినాడు.



నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.




ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూచారు. వారికి నోళ్ళకు బీగాలు పడ్డాయి. నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినది.



చుట్టుప్రక్కల వారికి హెచ్చరికగా వుండాలంటూ నరసింహారెడ్డి శిరస్సును రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేటట్లు చేశారు ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం.











You may also like

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు , రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి...

No comments:

Please do not enter any Spam links in Comment Box.